మహిళల సమస్యలను వారి ముంగిటనే పరిష్కరించే లక్ష్యంతో జాతీయ మహిళా కమిషన్ చేపట్టిన ‘మహిళా జన్ సున్వాయ్’ (ప్రజా విచారణ) కార్యక్రమం మహిళలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని కమిషన్ ఛైర్మన్ విజయ రహత్కర్ తెలిపారు. గురువారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించిన వేలాది ఫిర్యాదులు కమిషన్‌కు వస్తున్నాయని, బాధితులు ఢిల్లీ వరకు వచ్చి తమ సమస్యలను చెప్పలేని పరిస్థితుల్లో కమిషనే నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తోందని విజయ రహత్కర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 100కు పైగా జన్ సున్వాయ్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో ఏకకాలంలో ప్రజా విచారణలు నిర్వహించి సుమారు 15 నుండి 20 వేల కేసులను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె వివరించారు. మల్కాజిగిరిలో నిర్వహించిన హియరింగ్‌లో మొత్తం 30 కేసులను విచారించినట్లు, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
స్థానిక యంత్రాంగం, పోలీసు విభాగం మహిళా కమిషన్‌తో సమన్వయంతో పనిచేయడం వల్ల బాధిత మహిళలకు మరింత భరోసా కలుగుతుందని విజయ రహత్కర్ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన హైదరాబాద్, మల్కాజిగిరి అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, అడిషనల్ డిజిపి చారుసిన్హా, జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డిఓ శ్యాంప్రకాష్, ఎంఆర్ఓ సీతారాం, డిడబ్ల్యూఓ శారద మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

