మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధి వేగవంతమవుతుందని తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసూరి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన మంత్రి సీతక్క, విద్య మహిళల అభ్యున్నతికి కీలకమని, విద్య ద్వారా విజ్ఞానం పెరిగి సమాజంలో రాణించవచ్చని చెప్పారు. ప్రతి మహిళ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, క్రమశిక్షణతో ఏ రంగంలోనైనా ప్రతిభ చాటుకోవాలని సూచించారు.
మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా జీరో వడ్డీ రుణాలు అందజేస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. 15 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళను సంఘాల్లో సభ్యులుగా చేర్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నట్లు ఆమె వివరించారు.
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ యువతలో అవగాహన పెంచడం కోసం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రత, ట్రాఫిక్, సైబర్ భద్రత వంటి అంశాలపై యువతకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా “సురక్ష దీప్” భద్రతా బోర్డులను విడుదల చేశారు.

