రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో నిజామాబాద్, కామారెడ్డిలతో కూడిన ఉమ్మడి జిల్లాను ముందంజలో నిలపాలని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసురి అనసూయ సీతక్క సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలుపై నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సన్నాహక సమావేశంలో, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సంగ్వాన్ లు ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి దృష్టికి తెచ్చారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, పల్లెలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ పనుల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రైతు సంక్షేమం, విద్య, యువత, మహిళలు, పర్యావరణం వంటి అంశాలలో నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగులు ప్రగతి ప్రణాళిక అమలులో క్రియాశీలక పాత్ర పోషించాలని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని కోరారు.
రానున్న మూడు నెలల వ్యవధిలో ప్రజారోగ్యం, విద్య, వైద్యం, అంగన్వాడీల నిర్వహణ, స్త్రీ శిశు సంక్షేమం, పారిశుధ్యం తదితర అంశాలలో స్పష్టమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. బాల్య వివాహాలు, డ్రగ్స్, కల్తీకల్లు, మత్తు పదార్థాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అంగన్వాడి, గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయించాలని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలపై గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం రూపొందించిన మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వ సలహాదారులు పి.సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంపొందించాలని, అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేయించాలని, రోడ్ల మరమ్మతులు, రెవెన్యూ సంబంధిత అనుమతులపై దృష్టి సారించాలని కోరారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, కేంద్ర నిధులతో చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి సీతక్క చేతుల మీదుగా ముగ్గురు దివ్యాంగులకు ల్యాప్ టాప్ లు అందజేశారు.

