ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలను స్వాగతిస్తూనే, ఈ ఘటనపై వార్తా కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (TWJఎఫ్) కామారెడ్డి జిల్లా నాయకులు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ కేసులను ఎత్తివేయాలని, సంబంధిత పోలీసు అధికారులపై విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన ముత్తగారి శిరీష్ గౌడ్, ముత్తగారి రోజా ల నిర్మాణాలను అధికారులు కూల్చివేయడం పట్ల TWJఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో TWJఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొంపల్లి ప్రవీణ్ గౌడ్, జిల్లా కార్యదర్శి కర్ణాకర్, నేషనల్ కౌన్సిల్ మెంబెర్ శీర్ల వంచ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, ఈ ఘటనకు సంబంధించిన వార్తా కవరేజీ కోసం విధులు నిర్వహించడానికి వెళ్లిన జర్నలిస్టులపై శిరీష్ గౌడ్ పోలీసులతో కుమ్మక్కై అధికార దుర్వినియోగం ద్వారా తప్పుడు కేసులు నమోదు చేయించడం అన్యాయమని అన్నారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కుల ఉల్లంఘన అని వారు అభిప్రాయపడ్డారు.
జర్నలిస్టులపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని, అక్రమ కేసులు నమోదు చేసిన సంబంధిత పోలీసు అధికారులపై విచారణ చేపట్టాలని, జర్నలిస్టులు భయభ్రాంతులు లేకుండా విధులు నిర్వహించేలా రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని కోరారు.

