జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 కార్యక్రమం జూన్ 25, 2026 నుంచి జిల్లాలో ప్రారంభం కానుందని తెలిపారు. ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడం, ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దడం, మార్పులు, చేర్పులు, తొలగింపులను పారదర్శకంగా నిర్వహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజలు తమ వివరాలను సరి చూసుకోవాలని ఆయన సూచించారు.
జూన్ 25 నుంచి జూలై 24, 2026 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే (ఎన్యూమరేషన్) కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తారు. ప్రజలు వారికి అవసరమైన సమాచారం అందించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
SIR-2026 కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం, ముసాయిదా ఓటరు జాబితా జూలై 31, 2026న ప్రచురించబడుతుంది. ఆ తర్వాత క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు కొనసాగుతుంది. అనంతరం, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 28, 2026 వరకు పూర్తవుతుంది. తుది ఓటరు జాబితా అక్టోబర్ 1, 2026న ప్రచురించబడుతుంది.












