రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై జోనల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల జారీ నుంచి ఎంపిక జాబితా ఖరారు వరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్బీ) ద్వారానే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో జోనల్ స్థాయి ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై జోనల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల జారీ నుంచి ఎంపిక జాబితా ఖరారు వరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎంఎస్ఆర్బీ) ద్వారానే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ మార్పు ద్వారా జోనల్ కార్యాలయాలపై పని ఒత్తిడి తగ్గుతుందని, నియామక ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. జీరో వెకెన్సీ విధానంలో పోస్టుల భర్తీని ఎప్పటికప్పుడు చేపడుతున్నందున, ఈ కొత్త నిర్ణయం వల్ల త్వరితగతిన నియామకాలు పూర్తవుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రి తన ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసీ అసిస్టెంట్లు, మలేరియా ఆఫీసర్లు, స్టాటిస్టికల్ ఆఫీసర్లు, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, మెడికల్ రికార్డ్స్ టెక్నీషియన్ వంటి పోస్టుల భర్తీ జోనళ్ల వారీగా జరుగుతోంది. జోన్-1, జోన్-2, జోన్-3, జోన్-4 పరిధిలోని విశాఖ, రాజమహేంద్రవరం, గుంటూరు, కడప కార్యాలయాల ద్వారా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, ఎంపిక జాబితా ఖరారు, కౌన్సెలింగ్, పోస్టింగ్ ఉత్తర్వుల జారీ వంటి ప్రక్రియలన్నీ ప్రాంతీయ కార్యాలయాల ద్వారానే జరుగుతున్నాయి.
అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తున్నాయని, పోస్టుల సంఖ్యకు అనుగుణంగా వచ్చే దరఖాస్తుల పరిశీలనకు, ఎంపిక జాబితా ప్రకటించడానికి ఎక్కువ సమయం పడుతోందని మంత్రి వివరించారు. ఉదాహరణకు, రాజమహేంద్రవరం జోనల్ కార్యాలయం ద్వారా 310 నర్సుల పోస్టులకు 12,000 దరఖాస్తులు రాగా, వాటి పరిశీలనకు మూడు నెలల సమయం పట్టిందని తెలిపారు. జోనల్ కార్యాలయాల్లో సిబ్బంది కొరత కూడా ఈ ఆలస్యానికి ఒక కారణమని పేర్కొన్నారు.
ఇకపై రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే జోనల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం వల్ల అధికారులపై ఒత్తిడి తగ్గుతుందని, ఉద్యోగుల పదోన్నతులు, సర్వీసు వ్యవహారాల పరిశీలనకు తగిన సమయం దొరుకుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రిక్రూట్మెంట్ బోర్డులో దరఖాస్తుల పరిశీలన నుంచి ఎంపిక జాబితా ఖరారు వరకు స్పష్టమైన విధానం అమల్లో ఉందని, ఇప్పటికే ఈ బోర్డు ద్వారా పలు వైద్య పోస్టుల నియామకాలు విజయవంతంగా జరిగాయని ఆయన గుర్తు చేశారు. గత 2024 జూన్ నుంచి మార్చి 31, 2026 వరకు ఈ బోర్డు ద్వారా 2,310 నియామకాలు జరిగాయి. త్వరలో బోధనాసుపత్రుల్లో 317 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ కూడా జరగనుంది.







