కీసర మున్సిపల్ పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో కే.ఆర్.కె డీ.ఈడీ కాలేజీ ప్రాంగణంలో ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల మౌనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల కథనం ప్రకారం, కాలేజీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ భారీ నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ అనుమతులు లేవని, నిబంధనలను పూర్తిగా పక్కనపెట్టి పనులు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోజురోజుకూ నిర్మాణం వేగంగా సాగుతున్నప్పటికీ, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
సాధారణ పౌరులు చిన్న నిర్మాణాలు చేపట్టినా వెంటనే నోటీసులు జారీ చేసే మున్సిపల్ అధికారులు, ఇంత భారీ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇలాంటి అక్రమాలకు అండగా మారుతోందని వారు ఆరోపిస్తున్నారు.
“అనుమతులు లేకుండా భారీ నిర్మాణం ఎలా కొనసాగుతోంది..? అధికారులకు సమాచారం లేదా..? లేక ఎవరి ఒత్తిళ్లకైనా తలొగ్గుతున్నారా..?” అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై వెంటనే విచారణ చేపట్టి, నిర్మాణాన్ని నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోకపోతే, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై మున్సిపల్ యంత్రాంగం ఎలాంటి స్పందన తెలియజేస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.










