తెలంగాణలోని బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామిని కోరారు. ఈ ప్లాంట్ ద్వారా ఉక్కు కొరత తీరడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 'తెలంగాణ రైజింగ్–2047' విజన్ లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సీఎం కేంద్ర మంత్రులకు వివరించారు.
తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని, ఇందుకు అవసరమైన సాంకేతికత, వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
2034 నాటికి హైదరాబాద్‌ను కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సీఎం కోరారు. అలాగే, ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.











