నిజామాబాద్, 2026-07-19
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ బోనాలు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని కోటగల్లిలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ బోనాలు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు.
నగరంలోని కోటగల్లిలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం, అలాగే నాందేవ్వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆషాఢ మాసం తెలంగాణ ప్రజలకు ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు. గ్రామదేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పశువులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటూ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు.
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, పూర్వీకుల సంప్రదాయాలను, గ్రామదేవతల పట్ల ఉన్న విశ్వాసాన్ని భావితరాలకు అందించే ఆధ్యాత్మిక వేడుక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యమని, మహిళలు పాలు, బెల్లంతో వండిన అన్నాన్ని కొత్త కుండలో ఉంచి, వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించి తలపై మోసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం బోనాల ప్రత్యేకత అని వివరించారు. పోతురాజుల నృత్యాలు, ఘటం ఊరేగింపులు, రంగం వంటి సంప్రదాయాలు బోనాల ఉత్సవాలకు మరింత వైభవాన్ని తీసుకువస్తాయని చెప్పారు.
అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో సుఖసంతోషాలుగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతకాయల రాజేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, కవిత, మైసమ్మ ఆలయ కమిటీ ప్రతినిధులు దేవేందర్, గౌడ్ తదితరులు పాల్గొన్నారు.










