మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసల తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్ళడం లేదని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ ఆ బాలుడు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పూసల తండాకు చెందిన గుగులోత్ రాందాస్, స్వరూప దంపతుల కుమారుడు పవన్ (3వ తరగతి చదువుతున్నాడు). ఇటీవల పాఠశాలకు వెళ్లడం లేదని తల్లి స్వరూప అతడిని మందలించింది. ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన పవన్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల తర్వాత పవన్ తన తల్లికి విషయం చెప్పడంతో, కుటుంబ సభ్యులు అతడిని వెంటనే హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ బాలుడికి వైద్యులు చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతున్న క్రమంలో నిన్న బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వెల్లువెత్తుతున్నాయి.










