రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సంక్షేమ పథకాలు, విద్యా కార్యక్రమాల అమలుపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం పావలా వడ్డీకే రుణాలు, మత్స్యకారులకు ఆర్థిక సహాయం, యువతకు విదేశీ భాషా శిక్షణ వంటి అంశాలపై ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, సూపర్ సిక్స్ పథకాల పురోగతిని, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
దీపం-2.0 పథకం కింద సబ్సిడీ సొమ్ము సకాలంలో లబ్ధిదారులకు చేరేలా చూడాలని, 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇప్పటికే రూ.10 వేల కోట్లు 67 లక్షల మందికి లబ్ధి చేకూర్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, బీసీ హాస్టళ్లలో నెట్ జీరో విధానం, ఆరోగ్యకరమైన క్యాంపస్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు.
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మే 19న వారి ఖాతాల్లోకి రూ. 286 కోట్లు జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా, ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు జర్మన్ భాషలో శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. ఈ శిక్షణ ద్వారా వారు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు పొందవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.











