ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ శాఖల పనితీరును, ప్రజలకు అందిస్తున్న సేవల నాణ్యతను మెరుగుపరచడంపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీజీఎస్, పబ్లిక్ పర్సెప్షన్ వంటి అంశాలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా, సమర్థతను పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రజల అభిప్రాయం (పబ్లిక్ పర్సెప్షన్) కనీసం 80-90 శాతం సానుకూలంగా ఉండేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీలో లోటుపాట్లున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హులందరికీ సకాలంలో అందేలా చూడాలని సూచించారు.
దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ల డెలివరీకి డబ్బులు వసూలు చేయడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్ స్టేషన్లలో సౌకర్యాలు, ఔట్ సోర్సింగ్ సేవల నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు.

