దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా యువజన & క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, శ్రీపాదరావు శాసనసభ సభాపతి పదవికి వన్నె తెచ్చిన మహనీయుడని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో విశిష్ట పాత్ర పోషించారని కొనియాడారు. ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించడం గౌరవకరమైన విషయమని తెలిపారు.
1935 మార్చి 2న జన్మించిన శ్రీపాదరావు, విద్యార్థి దశ నుంచే ప్రజా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ధన్వాడ గ్రామ సర్పంచ్‌గా, మంథని నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు.
శాసనసభ స్పీకర్‌గా నిష్పాక్షికత, క్రమశిక్షణతో సభా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి, పార్టీలకు అతీతంగా గౌరవం పొందారు. గ్రామాభివృద్ధి, బలహీన వర్గాల సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి విశేషమని కలెక్టర్ పేర్కొన్నారు.
1999 ఏప్రిల్ 13న దుర్మరణం చెందినప్పటికీ, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఆయన చూపిన అంకితభావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


