ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూలూరుపాడులో మండల స్థాయి సభ జరిగింది. ఈ సభకు జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి గ్రామపంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
జూలూరుపాడు రైతు వేదికలో జరిగిన ఈ సభలో, వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. రహదారి భద్రత, వ్యవసాయం, విద్య, వైద్యం, మిషన్ భగీరథ, నీటిపారుదల, మహిళా సంఘాల పథకాల వివరాలను తెలియజేశారు. అనంతరం సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించి, ముందస్తు బుకింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థుల సంక్షేమం కోసం మధ్యాహ్న భోజన పథకంలో నిర్దేశిత మెనూను తప్పనిసరిగా పాటించాలని, వేసవిలో చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వేసవి దృష్ట్యా చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
పంచాయతీ వ్యవస్థ కీలకమని, సర్పంచులు, వార్డు సభ్యులు, కార్యదర్శులు బాధ్యతాయుతంగా వ్యవహరించి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతారం గ్రామంలో ఫ్లోరైడ్ సమస్యపై స్పందించిన కలెక్టర్, సురక్షితమైన మంచినీటి సరఫరాకు మిషన్ భగీరథ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.











