రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఈ నెల 28వ తేదీన నిర్వహించబడే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయని ఆయన తెలిపారు.
క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిలు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి వివిధ రకాల కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావచ్చని కమిషనర్ సూచించారు. చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా, జూడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి, రాజీ పడదగిన కేసులను గుర్తించాలని, ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు. తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునేవారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. లోక్ అదాలత్లో ఇరుపక్షాల సమ్మతితో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుందని, ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో పరిష్కారం జరుగుతుందని వివరించారు.
“ప్రజలు, పోలీసులు, న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించవచ్చు” అని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.











