రాష్ట్రంలో మహిళల సాధికారతను పెంపొందించడం మరియు వారిని రాష్ట్ర పురోగతిలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పది సూత్రాల ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక 'జనాభా స్థిరీకరణ' విధానంలో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రతిపాదించబడిందని వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ పది సూత్రాల ప్రణాళికలో మహిళల జీవనంలోని అన్ని దశల్లోనూ నాణ్యమైన సేవలను అందుబాటులో ఉంచి, వారికి సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించడం, సంతాన ప్రాప్తి హక్కును సరైన విధానంలో సాకారం చేయడం, ఆర్థిక స్వావలంబనకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడం, శిశు సంరక్షణలో పురుషులను భాగస్వాములను చేయడం వంటి అంశాలు ముఖ్య ఉద్దేశ్యాలని మంత్రి వివరించారు.
పురుషులతో సమానంగా మహిళలు ఆర్థిక ఉత్పాదక శక్తిగా ఆవిర్భవించడానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా, ఆరేళ్ల వయసు వరకు శిశువుల సంరక్షణ కోసం 50 మందికి పైగా ఉద్యోగులుండే ప్రతి చోటా శిశు పాలనా కేంద్రాలను (క్రెష్లు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అలాగే, ప్రతి లక్ష జనాభాకు ఒక 'వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్' ను పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోబడతాయి.
ప్రస్తుతం 180 రోజుల ప్రసూతి సెలవులను (మెటర్నిటీ లీవ్) 12 నెలల పేరెంట్ హుడ్ లీవ్ గా తల్లిదండ్రులిద్దరూ సమానంగా వాడుకునే వీలు కల్పిస్తామని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా, సంతాన వైఫల్యంతో బాధపడుతున్న కుటుంబాలకు సంతానోత్పత్తి సేవలను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 'మాతృత్వ' పథకం కింద 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్' ను ఏర్పాటు చేయడంతో పాటు, సంబంధిత డిప్లొమా మరియు అడ్వాన్స్డ్ కోర్సులను ప్రారంభిస్తారు.
గర్భధారణకు ముందు, అనంతర చర్యల పట్ల మహిళలకు తగిన కౌన్సిలింగ్ అవసరమని, ప్రస్తుతం 70 శాతం వరకు జరుగుతున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఐదేళ్లలో 50 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 68 శాతం వరకు జరుగుతున్న సిజేరియన్లను ఐదేళ్లలో 40 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందని, పిన్న వయసులో గర్భధారణను 9 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు.











