కామారెడ్డి, జూన్ 30
కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు గాను జూలై 1 నుంచి 31 వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ నెల రోజుల పాటు పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జులై 1 నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే లేదా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించారు.
జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












