తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా 'రాష్ట్ర పండుగ'గా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో, ఇకపై ప్రతి సంవత్సరం 'వైశాఖ శుక్ల పక్ష దశమి' నాడు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అధికారిక ప్రకటన ఆర్యవైశ్య సమాజంలో హర్షం వ్యక్తం అవుతోంది. ఇది తమ సంస్కృతి, సంప్రదాయాలకు లభించిన గుర్తింపుగా వారు అభివర్ణిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, కాల్వ సుజాత గుప్తలకు ఆర్యవైశ్యుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం తమ సామాజిక వర్గానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆకాంక్షలను గౌరవించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సహకారంతో మరింత వైభవంగా జరిగే అవకాశం ఉంది.












