సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల వద్ద గడ్డి వాములు, ఎండిన పంట అవశేషాలు అగ్నికి కారణం కావచ్చని ఆయన అన్నారు. రైతులు తమ పొలాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, గడ్డి వాములు, పొలాల సమీపంలో నీటి తొట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎండిన గడ్డి వద్ద మంటలు వేయరాదని హెచ్చరించారు.
ఇళ్ల వద్ద వంటలు చేసిన తర్వాత పొయ్యిని పూర్తిగా ఆర్పకుండా పనులకు వెళ్లడం వల్ల గాలికి మంటలు చెలరేగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే, వేసవిలో రాత్రి వేళల్లో ఇళ్ల బయట లేదా మేడలపై నిద్రించే సమయంలో దొంగతనాలు జరిగే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వేసవి కాలంలో చెరువులు, కుంటల వద్ద ఈతకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా యువత, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలో వెళ్లాలని, లోతు తెలియని ప్రాంతాల్లో ఈత కొట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు.
మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం పూర్తిగా నిషేధమని, చెరువులు, కుంటల వద్ద నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వెంటనే 100 లేదా 112 నంబర్లకు లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.











