తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరటనిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 6,000కు పైగా ఖాళీలున్నట్లు అంచనా.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వయోపరిమితి కారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి అవకాశం లభించింది. సర్వీస్ కమిషన్ పాలక మండలి త్వరలోనే శాఖల వారీగా ఖాళీల వివరాలను సమీక్షించి, భర్తీ ప్రక్రియను ప్రారంభించనుంది.
డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో అధ్యాపక పోస్టులతో పాటు, దేవాదాయ, అటవీ, సర్వే సెటిల్మెంట్, పాఠశాల విద్యాశాఖ, ఆర్టీసీ, పురపాలక శాఖల్లో ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.
టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలోనూ నూతన విధానాలను అనుసరించనుంది. ప్రతి రెండు వారాలకొకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా ఉద్యోగ ప్రక్రియ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.











