పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, పెట్రో ఉత్పత్తుల సరఫరాను సజావుగా కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, ఈ అంశంపై రాష్ట్ర యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ కమిటీ పరిస్థితులను సమీక్షిస్తోందని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు, బ్లాక్ మార్కెట్‌ను నిరోధించడానికి కమిటీలు ఏర్పాటు చేసి, నోడల్ అధికారులను నియమించినట్లు సీఎం వెల్లడించారు.
ప్రాధాన్యతా క్రమంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి పెట్రోల్ బంకులో ఉన్న స్టాక్, వినియోగంపై అధికారులు నిఘా ఉంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందని, ప్రస్తుతం 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నాయని సీఎం వివరించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగించేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించినట్లు, ఈవీల తయారీ, బ్యాటరీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షలకు పైగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు, ఆర్టీసీలో ఇక ముందు అన్ని ఈవీ బస్సులనే వినియోగించనున్నట్లు సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.











