తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, గచ్చిబౌలి స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై చర్చించారు. స్టేడియంను సమీకృత క్రీడా కేంద్రంగా మార్చాలని, అత్యాధునిక మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో అథ్లెటిక్స్, ఫుట్ బాల్ స్టేడియంలు నిర్మించాలని, వివిధ క్రీడలకు శిక్షణ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సేకరించాలని, పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థలకు బ్రాండింగ్ అవకాశాలు కల్పించాలని సూచించారు.
హైదరాబాద్ ను దేశానికి క్రీడల్లో రోల్ మోడల్ గా నిలబెట్టేందుకు కృషి చేయాలని, జూన్ 2లోగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. స్టేడియంలో హెలిప్యాడ్ తో సహా అన్ని ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలని, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిర్వహణ ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.
గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ఇప్పటికే ఆర్కిటెక్చర్ ను నియమించామని, బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పోర్ట్స్ హబ్ సభ్యులు, క్రీడాశాఖ అధికారులు పాల్గొన్నారు.











