తెలంగాణలో సాగునీటి రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని, తుమ్మిడిహెట్టి బరాజ్ పునరుద్ధరణకు కృషి చేస్తోందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం వారు తుమ్మిడిహెట్టిని సందర్శించి, ప్రాణహిత నదికి జలహారతి ఇచ్చారు.
తుమ్మిడిహెట్టి ప్రతిపాదిత సైట్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన మంత్రులు, బరాజ్ ఎత్తు, సామర్థ్యం, పూర్వపు పనులు, మహారాష్ట్రలోని ముంపు పరిధి, అటవీ, పర్యావరణ అనుమతులపై అధికారులతో చర్చించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి, కాళేశ్వరం పేరుతో అనవసర ఖర్చులు చేసిందని విమర్శించారు.
గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉన్నా, గత ప్రభుత్వం పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి విద్యుత్ భారాన్ని పెంచిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోవడంతో ఆ నీటిని వాడుకునే పరిస్థితి లేదని, తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మిస్తే విద్యుత్ ఖర్చు లేకుండా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించవచ్చని తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల బరాజ్ నిర్మాణానికి అంగీకరించాలని కోరనున్నట్లు మంత్రి చెప్పారు. శివిని గ్రామానికి ముంపు సమస్య ఉండదని, భూములు కోల్పోయిన వారికి మెరుగైన పరిహారం అందిస్తామని, ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాల్లోనూ భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు.
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు ఈ ప్రాజెక్టు అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి జూపల్లి కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు మానుకోవాలని, అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.











