గోరక్షకులపై దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – బీజేపీ
— కాంగ్రెస్ పాలనలో చట్టవ్యవస్థ కూలిపోయిందని ఆరోపణ
— కామారెడ్డిలో కలెక్టర్‌కు బీజేపీ వినతి పత్రం సమర్పణ
కామారెడ్డి, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం):
రాష్ట్ర రాజధానిలో గోరక్షకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, పోచారంలో గోవులను తరలిస్తున్న ఎం.ఐ.ఎం నాయకులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సోను సింగ్ (ప్రశాంత్) పై తుపాకీతో కాల్పులు జరిపారని, ఆయన తీవ్రంగా గాయపడి ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మతోన్మాద దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన విమర్శించారు. ఎం.ఐ.ఎం గూండాలు ప్రజలపై, పోలీసులపై కూడా దాడులు చేయడం చట్టవ్యవస్థ క్షీణతకు నిదర్శనమని అన్నారు.
“బీఆర్‌ఎస్ మౌన మద్దతు, కాంగ్రెస్ వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్లనే ఎం.ఐ.ఎం కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. గోరక్షకులపై కాల్పులు జరిపిన నిందితులను అరెస్ట్ చేయలేని ప్రభుత్వం నైతిక హక్కును కోల్పోయింది,” అని నీలం చిన్న రాజులు అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు.
కామారెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.