విద్యార్థులే దేశానికి వెన్నుముక… మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
— మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18
జిల్లా కేంద్రంలోని కళాభారతి స్టేడియంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “విద్యార్థులే దేశానికి వెన్నుముక… నేటి బాలలే రేపటి పౌరులు” అని పేర్కొన్నారు. యువత దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తారని, ప్రతి విద్యార్థి మత్తు పానియాలు, మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా భవిష్యత్తు మరింత బలపడుతుందన్నారు. మాదకద్రవ్యాల ప్రభావం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబం, సమాజంపై కూడా తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుందని సంబంధిత అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో DLCC నాగ రాణి, ASP చైతన్య రెడ్డి, DWO ప్రమీల, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.