*_వ్యవసాయ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులు..!!_*
వెటర్నరీ డిగ్రీలో ఒకో సీటుకు 30మంది విద్యార్థులు దరఖాస్తు
ప్రభుత్వ ఉద్యోగాలకు అనువైన కోర్సులని పలువురి ఆసక్తి
హైదరాబాద్, జూలై 10 వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సులకు క్రమక్రమంగా డిమాండ్ పెరుగుతున్నది.
రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో విస్తరణ అధికారులు, పశువైద్యశాఖలో వెటర్నరీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేస్తారన్న ఆశతో విద్యార్థులు వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లభించకున్నా.. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక పద్ధతులతో కన్సల్టెన్సీలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ కోర్సుల వైపు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నట్టు వర్సిటీ అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ అనుబంధ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థుల పోటీ పెరిగింది. 2019లో మొత్తం 848 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో మొత్తం 1,696 సీట్లు భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది 1,500 సీట్ల భర్తీకి వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఇప్పటికే 10,665 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. వెటర్నరీ డిగ్రీలో 193 సీట్లకు ఒకో సీటుకు 30 మంది చొప్పున దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. గత నెలలోనే దరఖాస్తుల గడువు ముగిసినప్పటికీ.. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నెల 18 వరకు గడువు పొడిగించినట్టు అధికారులు వెల్లడించారు.