ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
వర్షపు నీటి లీకేజీపై తక్షణ చర్యలకు ఆదేశాలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 26
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి శనివారం కూకట్‌పల్లిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను (యూపీహెచ్‌సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి భవనంలో వర్షం నీరు గోడల నుండి కారుతున్న సమస్యపై ఆరా తీసిన కలెక్టర్, దీనిని నివారించడానికి స్లాబ్ పైన తక్షణమే టార్పాలిన్ షీట్ వేయించాలని సూచించారు.
ఆసుపత్రిలో రోజుకు ఎంతమంది ఔట్‌పేషెంట్లు వస్తున్నారు, వారి వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారని ఆన్‌లైన్‌లో పరిశీలించారు. మొదటిసారి వచ్చే వారికి ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ మమత కలెక్టర్‌కు వివరించారు. ఏఎన్‌సీ (యాంటెనాటల్ కేర్), బీపీ (రక్తపోటు), షుగర్ పరీక్షల కోసం పేషెంట్లు క్రమం తప్పకుండా వస్తున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధులపై ఫీవర్ సర్వే జరుగుతోందా, డెంగ్యూ పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించగా, ఇంటింటికీ వెళ్లి టెస్టులు చేస్తున్నామని, డెంగ్యూ నిర్ధారణ అయితే వారి కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ తెలిపారు.
యూపీహెచ్‌సీ వెనుక వైపు ప్రహరీ గోడ, గేటు అవసరమని మెడికల్ ఆఫీసర్ కలెక్టర్‌కు విన్నవించారు. అవసరమైన మరమ్మతులకు సంబంధించిన అంచనా వ్యయాలను రూపొందించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలోని మెడిసిన్ రూమ్, ల్యాబ్, ఎక్స్-రే, సిటీ స్కాన్ రూములను కూడా కలెక్టర్ పరిశీలించారు.
ఈ తనిఖీలో కూకట్‌పల్లి ఎమ్మార్వో స్వామి, మెడికల్ ఆఫీసర్ మమత, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.