జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్త
ఆందోళనలు తప్పవు.
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ
జాతీయ కార్యవర్గ సభ్యులు .
నాలుగు రోజుల వ్యవధిలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఇద్దరు జర్నలిస్టుల ఆత్మహత్యలు జర్నలిజంపై ఆధారపడి బతుకుతున్న విలేకరుల జీవితాల్లోని దుర్భర పరిస్థితులకు అద్దం పడుతున్నాయని బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా (తెలంగాణ) జాతీయ కార్యవర్గ సభ్యుడు తాడూరు కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం గోదావరిఖని పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు నాయిని మధునయ్య, శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలో మరో యువ పాత్రికేయుడు యోగి రెడ్డి ఆత్మహత్యలు తమను కలచి వేశాయని చెప్పారు.యాజమాన్యాల నుండి జీతభత్యాలు లేకపోయినా, సమాజ హితమే లక్ష్యంగా అనేకమంది జర్నలిజం వృత్తిపట్ల ఆకర్షితులై, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా కొనసాగుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలోనూ 200 మందికి పైగా జర్నలిస్టులు ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య కారణాలతో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రత, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు.ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.సమాచార పౌర సంబంధాల శాఖ, మీడియా అకాడమీలకు సమాంతరంగా, జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకువచ్చి, దానికి తగినన్ని నిధులు కేటాయించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ బ్యూరోక్రాట్ల చేతుల్లో, మీడియా అకాడమీ ఒక సంఘానికి నేతృత్వం వహిస్తున్న నేత కనుసన్నల్లో నడుస్తుండడం వల్ల, యావత్ తెలంగాణ జర్నలిస్టు సమాజానికి ఈ వ్యవస్థల పట్ల సంపూర్ణ విశ్వాసం లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతున్న అన్ని సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ తెలంగాణ జర్నలిస్టుల కోసం ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం రూపొందించాలని, ఇందుకుగాను అని సంఘాల నేతలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశంలోని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగా తెలంగాణలో జర్నలిస్టుల పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా జర్నలిస్టుల కోసం ప్రత్యేక ఆరోగ్య భీమా పథకం రూపొందించాలని, రాష్ట్రంలో పత్రిక యాజమాన్యాలకు జారీ చేస్తున్న ప్రకటనలు నుండి ప్రభుత్వం కొంత మొత్తాన్ని రికవరీ చేసి దానిని జర్నలిస్టుల సంక్షేమం కోసం వెచ్చించాలని కరుణాకర్ డిమాండ్ చేశారు.