జిల్లా పోలీసుల ప్రతిభ — రెండు కోట్లకు పైగా విలువైన మొబైల్‌ఫోన్లు రికవరీ
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 17:
జిల్లా పోలీసుల కృషితో పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి యజమానుల చెంతకు చేరుతున్నాయి. ప్రతి నెల సగటున 150కుపైగా ఫోన్లను రికవరీ చేస్తూ, కామారెడ్డి పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు రూ.2 కోట్లు 53 లక్షల విలువైన 1,579 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్, తెలిపారు.
తాజాగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 164 మొబైల్ ఫోన్లు (విలువ రూ.27 లక్షలు) రికవరీ చేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా రికవరీ బృందంలోని సిబ్బందిని ప్రశంసించారు.
ఎస్పీ మాట్లాడుతూ –
> “మొబైల్ ఫోన్ నేడు ప్రతి ఒక్కరికీ నిత్యావసరం. ఇందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్లు వంటి కీలకమైన డేటా ఉంటుంది. ఫోన్ పోగొట్టుకున్నవారు కేవలం పరికరాన్నే కాదు, భద్రతను కూడా కోల్పోతున్నారు,” అన్నారు.
పోలీసులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా ఫోన్లను సులభంగా గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని, సిమ్ కార్డును బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో RSI బాలరాజు, మరియు ఆరుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం, పనిచేస్తోందని తెలిపారు.
CEIR పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,026 మొబైల్ ఫోన్లు (విలువ రూ.6.45 కోట్లు) రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఎస్పీ వివరించారు.
బాధితులు తమ మొబైల్ ఫోన్ల వివరాలు తెలుసుకుని, జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI బాలరాజు, (ఫోన్: 8712686114) ని సంప్రదించి తమ పరికరాలను స్వీకరించవచ్చని తెలిపారు.
> “సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే, నేరాలపై విజయం సాధించడం సాధ్యమే,” అని ఎస్పీ రాజేష్ చంద్ర, పేర్కొన్నారు.