Site icon PRASHNA AYUDHAM

రాబోయేది ప్రజాపోరాటాల కాలం..1

రాబోయేది

Headlines

  1. “తెలంగాణలో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు సన్నాహాలు – కమ్యూనిస్టు ఉద్యమ పునరుజ్జీవనం”
  2. “ఎర్రజెండా గౌరవం – తెలంగాణలో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలకు కమ్యూనిస్టు శక్తుల సమీకరణ”
  3. “ప్రజాపోరాటాలకు సీపీఐ(ఎం) పిలుపు – బీజేపీ, కాంగ్రెస్‌పై విమర్శలు”

ప్రపంచం చూపు ఎర్రజెండా వైపు

కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశానికి భవిష్యత్‌ లేదు

మతోన్మాద కుతంత్రమే బీజేపీ విధానం

కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది

రాబోయేది ప్రజాపోరాటాల కాలం

మహాసభ సందర్భంగా ఎర్రజెండాను ఊరూరా తీసుకెళ్తాం.. : రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు ఎస్‌.వీరయ్య

జనవరిలో సంగారెడ్డిలో సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభ.

అమెరికా డాలర్‌ ఆధిపత్యం కొనసాగడం.. గాజాలో నరమేధం, లెబనాన్‌, ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు అమెరికా కనుసైగల్లో జరుగుతుండటంతో సామ్రాజ్యవాద శక్తులకు అనుకూల, కమ్యూనిస్టులకు ప్రతికూల వాతావరణముందనే చర్చ ఉండేది. కానీ, ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యం తగ్గుముఖం పడుతోంది. డాలర్‌ ఆధిపత్యానికి కళ్లెం వేస్తూ రష్యాలోని కజానాలో జరిగిన ‘బ్రిక్స్‌ఫ్లస్‌’ శిఖరాగ్ర సమావేశం పలు కీలక ప్రకటనలు చేసింది. అమెరికా ఆంక్షలకు జంకేదిలేదంటూ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ కరెన్సీగా చెలామణిలో ఉన్న డాలర్‌ను ఇక నుంచి గౌరవించబోమంటూ నిర్ణయించింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా ఒంటరి కాదంటూ బ్రిక్స్‌ఫ్లస్‌ ప్రకటించింది. మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనా సాధిస్తున్న అభివృద్ధి గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. ఆ దేశాన్ని పాలిస్తున్న ఎర్రజెండా వైపు ప్రపంచమంతా ఆలోచిస్తోంది” అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సంగారెడ్డి జిల్లాలో జనవరిలో నిర్వహించనున్న సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం శనివారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. చైనా ఎలక్ట్రికల్‌ కార్లు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయని, దీన్ని ఓర్వలేక అమెరికా చైనా ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తోందని తెలిపారు. అయినా చైనా వస్తువులు పెట్టుబడిదారి దేశాల ఉత్పత్తుల కంటే చౌకగా లభించే అవకాశాలే అధికంగా ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతున్న చైనాతో పాటు ఇటీవల ప్రాన్స్‌, శ్రీలంక ఎన్నికల్లో ఎర్రజెండా విజయాలు సాధిస్తున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు శిబిరాలు మరింత బలపడే అవకాశాలున్నాయన్నారు. భారత దేశంలో కూడా కమ్యూనిస్టులకు భవిష్యత్‌ ఉందా అనే తిరోగమన చర్చ అక్కడక్కడ జరుగుతోందన్నారు. అసలు కమ్యూనిస్టులు లేకుండా ఈ దేశానికి భవిష్యత్‌ ఉందా అని ప్రశ్నించారు. ప్రజల బతుకులు మారడానికి.. జనం సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు చూపుతున్న ప్రత్యామ్నాయ విధానాలు తప్ప పరిష్కారం లేదన్నారు. ప్రత్యామ్నాయ విధానాలంటే ఓట్లు, సీట్ల బలాబలాలు కాదని చెప్పారు. విద్య, భూమి, ఉపాధి, సామాజిక న్యాయం, స్వయం పోషణ అందరికీ దక్కాలన్నదే కమ్యూనిస్టుల ప్రత్యామ్నాయ విధానమన్నారు.

దేశంలో హిందుత్వ స్థాపనే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. హిందుత్వమంటే ఏకశిలా ఖండమేమీ కాదని, వేల సంఖ్యలో కులాలుగా విభజించబడి ఉందని అన్నారు. హిందూ రాజ్యమంటే మనుధర్మ రాజ్యమేనన్నారు. రాజ్యాంగంలో రాసుకున్న సమాన హక్కులు, సమతాభావం, ఆర్థిక, సామాజిక సమావనత్వమనేవి మనుధర్మ రాజ్యాంగంలో ఉండబోవన్నారు. దానివి పరమ చాదస్తపు తిరోగమన విధానాలని, మతోన్మాద కుతంత్రాలే బీజేపీ విధానమని స్పష్టం చేశారు. దేశంలో తిరుగేలేదని విర్రవీగిన బీజేపీని పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పట్ల ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ గెల్చాక చేసిందేమీలేదన్నారు. ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు తప్ప వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారని చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా మహాసభల్లో చర్చిస్తామన్నారు. ఊరూరా ఎర్రజెండాను తీసుకెళ్తామన్నారు.

ఇంటింటికీ ఎర్రజెండా : చుక్క రాములు, : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

సంగారెడ్డి పట్టణంలో జరగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర 4వ మహాసభను పురస్కరించుకుని ఎర్రజెండాను ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ తీసుకెళ్తామని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు చెప్పారు. కార్మిక, కర్షక, రైతాంగ పోరాటాలకు ఎర్రజెండా నాయకత్వం వహిస్తుందన్నారు. బూర్జువా పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయ విధానాలతో పనిచేస్తున్న తమ పార్టీ రాజకీయ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. మహాసభ జయపద్రం కోసం అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశానికి పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.మల్లికార్జున్‌, జిల్లా కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, ఎ.మల్లేశం, మూడు జిల్లాల కార్యదర్శివర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, బి.రామచంద్రం, అతిమేల మాణిక్యం, ఎం.నర్సింహులు, గోపాల స్వామి, శిశిధర్‌, ఎల్లయ్య, సత్తిరెడ్డి, బాస్కర్‌, నర్సమ్మ, మహేందర్‌రెడ్డి, కె.మల్లేశం, బవసరాజు పాల్గొన్నారు.

తెలంగాణ పోరాటాల పోరుగడ్డ

ఎస్‌.వీరయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

దోపిడీ శక్తుల మెడలు వంచి సమరశీల పోరాటాలు నడిపిన పోరుగడ్డ తెలంగాణలో రాబోయే కాలమంతా పోరాటాల కాలమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజల్లో ఎండగట్టి ప్రజా ఉద్యమాలు నిర్వహించేందుకు సంగారెడ్డిలో జరిగే మహాసభ దోహదం చేయనుందన్నారు. ప్రపంచీకరణ భ్రమలు మంచు కొండలా కరిగిపోవడంతో సామ్రాజ్యవాద దేశాలు ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో అతలాకుతల మవుతున్నాయని చెప్పారు. సోషలిస్టు వ్యవస్థ ప్రాథమిక దశలోనే చైనాలో ఎంతో అభివృద్ధిని సాధిస్తుందంటే సంపూర్ణ సోషలిస్టు వ్వవస్థ నెలకొంటే ఇంకెంత అద్భుత ప్రగతిని సాధిస్తుందో చూడాలనే తపన పెరుగుతోందన్నారు. ప్రపంచ యువత చైనా వైపు చూస్తుందన్నారు. అదే పరిస్థితి దేశంలోనూ కనిపిస్తుందన్నారు. బీజేపీ మతోన్మాద పాలన, కార్పొరేట్‌ విధానాల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన తీరు కూడా అలాగే ఉందన్నారు.

Exit mobile version