ప్రశ్నాయుధం న్యూస్, నవంబర్ 9, కామారెడ్డి :
ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడితో పాటు, ఈ విషయం బయటపడకుండా కప్పిపుచ్చినందుకుగాను మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ కు పంపిన ఘటన భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే గత మూడు నెలల క్రితం మండలంలోని ఒక పాఠశాలలో బాలికపట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే అది కేవలం రూమర్ మాత్రమేనని, ఏమీ జరగలేదంటూ కొందరు సదరు ఉపాధ్యాయుడికి బాసటగా నిలిచి ఇష్యూను బయటకు రాకుండా లోలోపల మేనేజ్ చేసేసారు. అక్కడికే ఈ విషయం క్లోజ్ అయిందని అనుకున్న సమయంలో ఇటీవల అవేర్నెస్ ప్రోగ్రాంకు హాజరైన జిల్లా జడ్జికి తమ గ్రామంలో కూడా ఇటువంటి సంఘటన చోటుచేసుకుందని ఒక మహిళ ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జడ్జి దీనిపై విచారణ చేయాలని అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. అంతేకాకుండా విచారణ అధికారి బాధ్యతను కామారెడ్డి డిఎస్పి కి కాకుండా ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాస్ కు అప్పగించింది. కేసు పూర్వాపరాలపై విచారణ జరిపి బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు బయటకు రాకుండా సహకరించిన మరో ఇద్దరితోపాటు ఉపాధ్యాయునిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఉపాధ్యాయునితో పాటు మరో ఇద్దరిని జిల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేయగా జుడీషియల్ కష్టడీకి తరలించాలని ఆదేశించింది.