ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తా….
–
– కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో వంగ మహేందర్ రెడ్డి అర్చనలు
– సెంటిమెంట్ దేవాలయంలో పి ఆర్ టి యు టిఎస్ నామ పత్రాలకు ప్రత్యేక పూజలు
నంగునూరు/సిద్దిపేట, ఫిబ్రవరి 7
మెదక్, నిజామాబాద్, అదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలికి (ఎమ్మెల్సీగా) పీ ఆర్ టీ యూ అధికారిక అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ మహేందర్ రెడ్డి, కవిత దంపతులు సిద్దిపేట నియోజక వర్గంలోని చారిత్రక, (నంగునూరు మండలం కోనాయిపల్లి) సెంటిమెంట్ ఆలయం అయిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నామ పత్రాలను స్వామివారి పాదాల వద్ద పెట్టి అర్చనలు చేశారు. స్వామి సన్నిధిలో నామ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించి మహేందర్ రెడ్డిని ఆశీర్వదించారు. ప్రత్యేక పూజల అనంతరం పి ఆర్ టి యు కార్యకర్తలతో కలిసి వెళ్ళి సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి నివాళులు ర్పించారు. ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాలోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవకే తన జీవితం అంకితం చేస్తానని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీలు పని చేసిన వారు వారి కోటా కింద మంజూరైన ఎమ్మెల్సీ అభివృద్ధి నిధులను విద్యారంగానికి కాకుండా ఇతర రంగాలకు కేటాయించారని తెలిపారు. తాను ఎమ్మెల్సీగా విజయం సాధిస్తే ఎమ్మెల్సీ కోటా కింద మంజూరయ్యే నిధులను ప్రభుత్వ పాఠశాలల కోసమే ఖర్చు చేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు విఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు వివిధ సౌకర్యాలు కల్పించానని చెప్పారు. ఎమ్మెల్సీగా గెలిస్తే జీవితాంతం విద్యారంగ, ఉపాధ్యాయ, సమాజ సేవకు పునరంకితం అవుతానని అన్నారు. తన అభ్యర్థిత్వానికి మ్యాండేట్ ఇచ్చిన పి ఆర్ టి యు నాయకత్వానికి కార్యకర్తలకు, అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్న ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిఆర్టియు, ఇతర అధ్యాపక సంఘాల కార్యకర్తలతో కలిసి ర్యాలీగా కరీంనగర్ వెళ్లి నామ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పి ఆర్ టి యు టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు గారి ఇంద్రసేనా రెడ్డి, ఆదరాసుపల్లి శశిధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.