ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు …!!

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న

ఆయుధం సెప్టెంబర్ 05:

 

ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జిల్లా సాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన జిల్లాలోని 28 మంది ఉపాధ్యాయులను శాలువా, ప్రశంస పత్రంతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని, సమాజంలో మీ పాత్ర చాలా గొప్పదని, మిమ్ముల్ని మార్గదర్శకులుగా తీసుకొని మీ అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని అన్నారు. ఇప్పుడు మీ వద్ద చదివేవాళ్ళు 10, 20 సంవత్సరాలలో ఉన్నత స్థానంలో ఉంటారని, ఉపాధ్యాయుల సహకారం వలననే మనమందరం ఈ స్థాయికి చేరుకున్నామని మనల్ని మన ఉపాధ్యాయులు ప్రోత్సహించిన మాదిరిగానే మీరు కూడా విద్యార్థులకు గుణాత్మక బోధన చేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాఠశాలలలో 100% పనులు పూర్తి చేయడం జరిగిందని అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కష్టపడి పనిచేసి విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభ ను వెలికి తీయాలని, రానున్న పదవతరగతి పరీక్షలలో జిల్లాను టాప్ 5 లో ఉంచేలా కృషి చేయాలని అన్నారు. విద్యతో పాటు క్రీడలలో విద్యార్థులను ప్రోత్సాహించాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలిస్తూ నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. గురుకుల విద్యాలయాలలో విద్యార్థులు కుటుంబాలకు దూరంగా ఉంటారని వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలన్నారు.

జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురువుల ఔన్నత్యాన్ని గుర్తు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఈ సందర్బంగా జిల్లాలో విద్యారంగంలో జరుగుతున్న ప్రగతిని వివరించారు.

ఈ కార్యక్రమం లో విద్యాశాఖ సమన్వయ కర్తలు ఉమారాణి, వేణుగోపాల్, నాగవేందర్, కృష్ణ చైతన్య, వెంకట రమణ రావు,జిల్లా పరీక్షల విభాగ అసిస్టెంట్ కమీషనర్ బలరాం, పరీక్షల విభాగ కార్యదర్శి నీలం లింగం, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధికారులు, నోడల్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now