*_సమ్మెలో టీచర్లు.చదువుకు దూరంగా విద్యార్థినులు..!!_*
తొమ్మిది రోజులుగా కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయుల సమ్మె
ఆట,పాటలతో గడుపుతున్న విద్యార్థినులు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 22 కస్తూర్బా పాఠశాలలు, ఏడు జూనియర్ కళాశాలలు
గజ్వేల్, డిసెంబర్ 19: సమస్యలు పరిష్కరించాలని కోరు తూ కస్తూర్బాపాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాపాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సమ్మె చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సత్వరమే తమ న్యాయమైన డిమాం డ్లు నెరవేర్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తొమ్మిది రోజులుగా ఉపాధ్యాయులు సమ్మెలో ఉండగా పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థినులు ఆట,పాటలతో గడుపుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థినులకు రక్షణగా ఉపాధ్యాయు లు లేక విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యాశాఖలోని సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ నెల మొదటివా రంలో సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. జిల్లాలో 22 కస్తూర్బా, ఏడు కస్తూర్బా జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న ప్రత్యేకాధికారులు, పీజీసీఆర్టీలు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్‌ఏంలు, సిబ్బంది తొమ్మిది రోజులుగా సమ్మె బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 22కస్తూర్బా పాఠశాలల్లో 4500, ఏడు జూనియర్ కళాశాలల్లో సుమారు 2500మంది విద్యార్థినులు ఉన్నారు. కస్తూర్బా పాఠశాలలో 310 మంది వర కు ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల్లో 140 మంది పీజీసీఆర్టీ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరి సమ్మెకు రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంఘీభావం ప్రకటించారు.
చదువులకు దూరంగా విద్యార్థినులు
కస్తూర్బా పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తుండటంతో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక విద్యార్థినులు పాఠశాల ఆవరణలో ఆటలు ఆడుతూ గడుపుతున్నారు. అసలే బాలికల విద్యాలయాలు ఉపాధ్యాయులు లేక వారి కి రక్షణ లేకుండా పోయింది. ఉపాధ్యాయుల సమ్మెతో మండల కేంద్రాలకు దూరంగా ఉన్న కస్తూర్బా పాఠశాలల పరిస్థితి దారుణంగా మారింది. టెన్త్ విద్యార్థినులకు డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేసి రివిజన్ చేయాల్సి ఉండగా పాఠాలు పూర్తికాక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు టైంటేబుల్ ప్రకటించడంతో పాఠా లు పూర్తికాక ఎలా చదువుకోవాలో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం వెంటనే డిమాండ్లు నెరవేర్చాలి
కొన్నేండ్లుగా సమగ్ర శిక్షా ఉద్యోగులుగా పనిచేస్తున్నాం. మా సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలి. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేసి పేస్కేల్ ఇవ్వాలి. తొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాం.
– క్రాంతికుమార్, సీఆర్పీ , సిద్దిపేట జిల్లా
పాఠాలు చెప్పాలేకపోతున్నాం
కస్తూర్బాలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తుండటంతో విద్యార్థినులకు పాఠాలు చెప్పలేకపోతున్నాం. అసెం బ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం.
– దాసరి పద్మ, కేజీబీవీ ములుగు, సిద్దిపేట జిల్లా