ఉపాధ్యాయుల పెద్ద మనసు
— వరద బాధితులకు తోడుగా PRTU
— కలెక్టర్ సహాయ నిధికి రూ.7.06 లక్షల విరాళం
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
ఊహించని వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన కామారెడ్డి జిల్లా ప్రజలకు అండగా నిలవాలని పెద్ద మనసుతో PRTU TS కామారెడ్డి జిల్లా శాఖ ముందుకొచ్చింది. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం రూ.7,06,011/- (ఏడు లక్షల ఆరు వేల పదకొండు రూపాయలు)ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో జిల్లా కలెక్టర్ సహాయ నిధికి అందజేసింది.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజు సమక్షంలో, జిల్లా అధ్యక్షులు సహా సంఘ బాధ్యులు కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ గారికి ఈ మొత్తాన్ని అందించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ఆపద సమయంలో మీరు చూపిన స్పందన ప్రశంసనీయం. ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరింతగా కొనసాగించాలి” అని అభినందించారు.
జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుశాల్ మాట్లాడుతూ, PRTU కేవలం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే కాకుండా సామాజిక సేవలోనూ అగ్రగామిగా ఉంటుందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా ఏర్పాటైనప్పటి నుండి 39 పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతులు కల్పించడం
రెడ్‌క్రాస్ సౌజన్యంతో 6 రక్తదాన శిబిరాలు నిర్వహించి 900 యూనిట్ల రక్తం అందజేయడం
కరోనా సమయంలో 22 రోజులు నిరంతరాయంగా 200 మందికి అన్నదానం, అన్ని మండలాలలో పేదలకు ధాన్యం పంపిణీ
స్వర్ణోత్సవాల నిర్వహణ, జిల్లా స్థాయి ఉపాధ్యాయ క్రీడల నిర్వహణ వంటి ఎన్నో కార్యక్రమాలను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమాలకు తోడ్పాటు అందించిన MLC శ్రీపాల్ రెడ్డి, రాష్ట్ర సంఘ అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, పెద్దలు బి. మోహన్ రెడ్డి, పి. వెంకట్ రెడ్డి, వంగ మహేందర్ రెడ్డి, గుండు లక్ష్మణ్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లాలో సహకరించిన మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర-జిల్లా-మండల బాధ్యులు, ప్రాథమిక సభ్యులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో DEO రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షులు జె. మధుసూదన్ రెడ్డి, సంగారెడ్డి గోవర్దన్, మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హన్మండ్లు, రమణ, రామచంద్ర రెడ్డి, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.