సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ప్రధాన కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని, తమ విద్యార్థులకు సంపూర్ణ బోధనను అందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రస్తుత పరిస్థితులలో బోధన సవాలుతో కూడుకున్నదని ఉపాధ్యాయులు నిరంతర విద్యార్థిగా కొత్త కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడే విద్యార్థులకు సులభంగా అన్ని అంశాలను బోధించగలుగుతాడన్నారు. ప్రభుత్వపరంగా పాఠశాలలలో మౌలిక అవసతుల మెరుగు కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. బోధనకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులకు సంపూర్ణ విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గతంలోలా కాకుండా ప్రభుత్వం పాఠశాల మెయింటెనెన్స్ నిధులు సకాలంలో విడుదల చేస్తున్నదని ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువ లేనిదని టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి అన్నారు. మన సమాజంలో ఉపాధ్యాయునికి తల్లిదండ్రుల తర్వాత స్థానం ఇవ్వబడింది అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు కోసం కృషి చేస్తున్నదని అన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని తమ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించిన ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లాలోని వివిధ ఉపాధ్యాయుల సంఘాల నాయకులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Oplus_131072