Site icon PRASHNA AYUDHAM

గీతంలో విజయవంతంగా ముగిసిన టెక్ ఫెస్ట్ జోనల్స్..

IMG 20251013 193116

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే అతి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ – టెక్ ఫెస్ట్, ఐఐటీ బాంబే ప్రాంతీయ రౌండ్ అయిన టెక్ ఫెస్ట్ హైదరాబాద్ జోనల్స్ 2025ను విజయవంతంగా నిర్వహించారు. గీతంలోని ఈఈసీఈ విభాగంతో పాటు జీ-ఎలక్ట్రా (స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్) నిర్వహించిన ఈ టెక్ ఫెస్ట్ జోనల్స్ పోటీలు విద్యార్థులలో ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో వారి నైపుణ్యాలు, సృజనాత్మకతను ప్రదర్శించడానికి జాతీయ వేదికను అందించారు. హైదరాబాదు ఎడిషన్ లో నాలుగు ప్రధాన పోటీలు జరగ్గా, ఈ ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఆన్ లైన్ కోడింగ్ ఛాలెంజ్ (తొమ్మిదో తరగతి నుంచి ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థుల వరకు), లైన్ ఫాలోవర్ రోబోటిక్స్ ఛాలెంజ్, పిక్ అండ్ ప్లేస్ మాన్యువల్ నియంత్రించే కంట్రోల్డ్ బాట్ పోటీ, టీఎఫ్ వో (టెక్ ఫెస్ట్ ఒలింపియాడ్) పాఠశాల విద్యార్థుల కోసం టెక్నికల్ క్విజ్ (8-10 తరగతులు)లు ఉన్నాయి. ఇందులో గీతంలోని ఆరుగురు అధ్యాపకులు, 40 మంది విద్యార్థి వాలంటీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది సమన్వయంలో దాదాపు 400 మందికి పైగా ఔత్సాహిక విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు అసాధారణమైన సృజనాత్మకత, బృంద కృషి, ఆవిష్కరణలను ప్రదర్శించి విజయవంతంగా ముగిశాయి. ఇందులో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవిల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని, అధ్యాపకులు ఎం.నరేష్ కుమార్, బి. బాలాజీ నాయక్ సమన్వయం చేశారు. విద్యార్థి సమన్వయకర్తలు ఎం.గౌరీశంకర్, ఎ.వేణురెడ్డి తదితరులు అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి, విజయవంతం చేయడానికి కృషి చేశారు.

Exit mobile version