సంగారెడ్డి/మెదక్, నవంబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్):ఆర్ఆర్ఆర్ సర్వేలో రైతులకు అన్యాయం జరిగిందని, రెండుసార్లు భూములు కోల్పోతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని, ఆర్ఆర్ఆర్ నిర్వాసితుల పక్షాన నిలుస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కాళేశ్వరం ప్యాకేజీ–18 కాల్వ పనులను పరిశీలించిన అనంతరం, రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె వివరంగా తెలుసుకుని స్పందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతులు మరియు స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో మూడు ముఖ్య అంశాలు ఉన్నాయని, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వేను అధికారులు అన్యాయంగా మార్చిన పరిస్థితిని ఆమె తీవ్రంగా ఎత్తిచూపారు. అలాగే హైటెన్షన్ వైర్లు, రైల్వే లైన్ అంశాల్లో కూడా ఇదే విధమైన నిర్లక్ష్యం కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్వాసితుల పొలాలు, ఇళ్లకు సరైన పరిహారం ఇవ్వకపోవడం పెద్ద సమస్యగా కనిపిస్తుందని, సరైన ధర వస్తేనే సంతకాలు పెడతామని రైతులు చెప్పడం పూర్తిగా న్యాయసమ్మతమని కవిత అన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు ఇదే జిల్లాలో భూములు కొనుక్కొని ఇప్పుడు మళ్లీ భూములు కోల్పోవాల్సిన పరిస్థితి రావడం హృదయ విదారకం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సార్లు ప్రాజెక్ట్‌ల వల్ల భూములు పోయే కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం పెద్దల భూములు, పేదవారి ఇళ్లు కాపాడే విధంగా సర్వే న్యాయంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాజకీయాల కోసం కాదు, రైతులకు న్యాయం చేయడానికే తాను వచ్చానని స్పష్టం చేశారు. నిర్వాసితుల సమస్య పరిష్కారం కోసం అవసరమైతే హైదరాబాద్‌లో పోరాటం చేస్తామని, సంబంధిత అధికారులను కలవడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై కూడా ఇప్పటికే ఎండీని కలిసి వివరించామని, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. ప్రాజెక్టుల కారణంగా కళాకారులు, పేదవారి ఇళ్లు పోతున్నాయని, అలాంటి వారికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. వీరి వెంట పలువురు నాయకులు రైతులు ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ సర్వేలో రైతులకు అన్యాయం: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
Published On: November 14, 2025 10:18 pm