Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన..!

IMG 20250520 WA1608

గవర్నర్ నివాసంలో చోరీ కలకలం.. టెక్కీ పనేనని తేల్చిన పోలీసులు

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ ఘటన

సుధర్మ భవన్ నుంచి నాలుగు హార్డ్ డిస్కులు అదృశ్యం

ఈ నెల 13న జరిగినట్టు గుర్తించిన అధికారులు

పంజాగుట్ట పోలీసులకు రాజ్‌భవన్ సిబ్బంది ఫిర్యాదు

కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర అత్యున్నత అధికార కేంద్రాల్లో ఒకటైన రాజ్‌భవన్‌లో జరిగిన చోరీ కలకలం రేపుతోంది. పంజాగుట్ట పరిధిలోని రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ఉన్న సుధర్మ భవన్‌లో నాలుగు కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్కులు అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 13న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో కొన్ని కంప్యూటర్ల నుంచి నాలుగు హార్డ్ డిస్కులు కనిపించకుండా పోయిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనిపై వారు వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రత ఉండే ప్రదేశంలో ఈ తరహా ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా ఈ చోరీకి పాల్పడింది రాజ్‌భవన్‌లోనే కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ అని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హార్డ్ డిస్కులలో ఏ విధమైన సమాచారం ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చోరీకి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version