సంగారెడ్డి ప్రతినిధి, మే 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): భూ భారతి రెవెన్యూ సదస్సును జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతిలు ప్రారంభించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా సోమవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్ పల్లి, అలియాబాద్ గ్రామల్లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ క్రాంతి వల్లూరు, టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి జనవరి 4 తారీఖున ప్రకటించబడి ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చింది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లా లో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎన్నిక చేయడం జరిగింది. అందులో భాగంగా భాగంగా మన సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నిర్ణయించడం జరిగిందన్నారు. జిల్లాలో భూ సమస్య లేని మండలంగా కొండాపూర్ ను తీర్చిదిద్దాలని అధికారులకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులపై అధికారులను టీంగా తయారు చేశామని తెలిపారు. రెవెన్యూ సదస్సులు అనంతరం ఒక నెల సమయంలో పల భూ సమస్యలన్నీ భూభారత చట్టంతో పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యల కోసం ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు, సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో వెళ్లి సమస్యను పరిష్కరిస్తారన్నారు. ఏలాంటి భూ సమస్యలైనా సత్వరమే పరిష్కరించాలన్నారు. రైతులు భూభారతి చట్టంలోని నియమాలన్నిటిని అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు తీసుకోవడానికి రెవెన్యూ సదస్సులలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డిలు పరిశీలించారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను కొండాపూర్ మండల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. పైలెట్ మండలంలో సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తారని అన్నారు. టీజీఐఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు భూ సమస్యలను నిర్లక్ష్యం చేశాయని, రైతులను కార్యాలయాల చుట్టూ కోర్టుల చుట్టూ తింపుతూ ఉండేవన్నారు. కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యల్ని పరిష్కరిస్తారన్నారు. దరఖాస్తులు తీసుకోవడంతో పాటు ప్రతి దరఖాస్తుకు రసీదు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల కతీతంగా అన్ని భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇచ్చిన దరఖాస్తుల్లో ఎలాంటి తప్పుడు లేకుండా చేసి భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ సదస్సులో సంగారెడ్డి ఆర్ డిఓ రవీందర్ రెడ్డి, తహసిల్దార్ అశోక్, రైతులు రైతు సంఘం నాయకులు, ప్రజలు ప్రజా ప్రతినిధులు రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి: టీజీఐఐసీ చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి
Published On: May 5, 2025 9:15 pm