సంగారెడ్డి ప్రతినిధి, మే 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగులు ఎప్పుడు ముందు ఉన్నారని, ఉద్యోగులు బోనసులడగట్లేదు.. సంక్షేమ పథకాలు ఆపి జీతాలు పెంచమనట్లేదు.. మాకు రావాల్సిన డీఏలు ప్రకటించాలని, మేము దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములే అవసరానికి మాకు ఇవ్వమని అడుగుతున్నారని టీజీజేఏసీ సంగారెడ్డి జిల్లా కో చైర్మన్ పి.ప్రసాద్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రిటైరైన ఉద్యోగులు వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 14 నెలలుగా ఎదురు చూస్తున్నారని, అవి ఈ ఆర్ధిక సంవత్సరంలో క్లియర్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాట మార్చి ప్రజల్లో ఉద్యోగులను పలుచన చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి చర్చలు సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి తప్పా కుటుంబం అంటూనే ఉద్యోగులను బజారన పడేయడం సమంజసం కాదని తెలిపారు. అక్టోబర్ 24న జెఎసి ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి మూడు గంటల పాటు సమస్యలన్నీ ఓపికగా విన్నారని, ఆర్థికేతర అంశాల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తామని, ఆర్థిక పరమైన అంశాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని చెప్పి ఇప్పుడు ఆరు నెలలు గడుస్తున్నా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమే జరగలేదని అన్నారు. జెఎసి ఇచ్చిన 57 డిమాండ్లలో 45 ఆర్థికేతర లేదా స్వల్ప ఆర్థిక భారం కలిగినవే ఉన్నాయన్నారు. ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే వెంటనే కాబినెట్ సబ్ కమిటీ లేదా ముఖ్యమంత్రి జెఎసి ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో విశ్వాసం నిలుపుకోవాలని ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి మొగులయ్య, జిల్లా సహధ్యక్షులు శంకర్, బట్టు నరసింహ రాజు, కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: టీజీజేఏసీ కో చైర్మన్ పి.ప్రసాద్
Published On: May 5, 2025 9:41 pm