నిబంధనల ప్రకారం అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు…… ఖమ్మం,జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

*నిబంధనల ప్రకారం అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు…… ఖమ్మం,జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించాలి నిరుపేదలైన లబ్దిదారులకు డ్వాక్రా ద్వారా రుణాలు మంజూరు చేయాలి

కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ సమావేశ మందిరంలో పైలెట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

పైలెట్ గ్రామాలలో 878 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే, 409 ఇండ్లు బేస్మెంట్ స్థాయి వరకు నిర్మించామని, 370 లబ్దిదారులకు ప్రభుత్వం మొదటి విడత లక్ష రూపాయల ఆర్థిక సహాయం విడుదల చేసిందని అన్నారు. మిగిలిన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అధికారులు వివరించారు.మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పైలెట్ ప్రాజెక్టు మంజూరు చేసిన ఇళ్ల పురోగతి, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికపై కలెక్టర్ మండలాల వారీగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను గ్రౌండింగ్ చేసే ముందు సంబంధిత లబ్దిదారులకు, మేస్త్రీ లకు మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్లను చూపించి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఇంటిని ఎలా నిర్మించుకోవాలో హౌజింగ్ శాఖకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.మండల కేంద్రాలలో జరుగుతున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి వివరాలు ప్రతి వారం రిపోర్ట్ అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం 4 విడతల్లో లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందిస్తుందని, మొదటి విడత పెట్టుబడి పెట్టలేని నిరుపేదలు ఉంటే డ్వాక్రా ద్వారా రుణాలు అందించాలని, పైలెట్ ప్రాజెక్టు లో దాదాపు 300 పైగా పేదలకు అందించామని అన్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో చర్చించి త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని, డబ్బు సమస్య ఉంటే డ్వాక్రా ద్వారా రుణాలు అందించాలని అన్నారు. ‌క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వివరాలను ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శి ఫోటో తీసి అప్ లోడ్ చేస్తారని, వీటిని అసిస్టెంట్ ఇంజనీర్, డీ.ఈ. క్షేత్ర స్థాయిలో ధ్రువీకరణ చేస్తారని, జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ప్రభుత్వానికి వెళ్లి లబ్ధిదారులకు చెల్లింపులు జరుగుతాయని అన్నారు.

వివాదాలకు తావు లేకుండా లబ్దిదారుల జాబితా ఎంపిక చేయాలని, ఖమ్మం జిల్లాలో డబ్బులు లేని కారణంగా గ్రౌండ్ చేయకుండా ఎవరు వేచి చూసేందుకు వీలు లేదని కలెక్టర్ తెలిపారు. గ్రామాల వారీగా లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి అవసరమైన వారికి డ్వాక్రా రుణాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు 14 వేల 763 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే, 10 వేల 921 దరఖాస్తులు సర్వే చేసి 9 వేల 150 దరఖాస్తులకు అర్హత ఉందని తేలిందని తెలిపారు. తుది లబ్దిదారుల జాబితా ర్యాండమ్ గా చెక్ చేసి అర్హులకు మాత్రమే జాబితాలో చోటు కల్పించారా లేదా గమనించి వివరాలు అందించాలని అన్నారు.ర్యాండమ్ చెక్ పూర్తి చేసుకున్న తర్వాత ఎంపిక చేసిన అర్హుల జాబితాను ఆమోదం తీసుకొని గ్రౌండ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులకు మాత్రమే ఇళ్ల కేటాయింపు చేయాలని అన్నారు. ‌

Join WhatsApp

Join Now