*ఇందిరమ్మ ఇండ్లు 600 చదరపు అడుగులకు మించొద్దు*
ఇంటి విస్తీర్ణం 400-600చ.అ. మధ్య ఉంటేనే అర్హులు
ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో 500 ఇండ్లు
ఈనెల 5 నుంచి 20 వతేదీ వరకు 28 మండలాల్లో భూభారతి
నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల పధకంలో భాగంగా నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లబ్దిదారుల ఎంపిక ఎంతవరకు పూర్తయితే అంతవరకు ఏరోజుకారోజు ఇన్‌ఛార్జి మంత్రుల నుంచి లబ్దిదారుల జాబితాకు ఆమోదం తీసుకోవాలని అలాగే ప్రతి నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతంలో కనీసం 500 ఇండ్లను కేటాయించి లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం నాడు చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణ రావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్ పరీక్ష ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మాణం జరిగేలా కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనర్హులని తేలితే ఇండ్ల నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేస్తామన్నారు. లిస్ట్-1, లిస్ట్-2, లిస్ట్-3 లతో సంబంధం లేకుండా నిరుపేదలను ఎంపిక చేయాలన్నారు.
*5 నుంచి 20వ తేదీవరకు..*
గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే ఈనెల 5వ తేదీ నుంచి 20వ తేదీవరకు జిల్లాకొక మండలం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. పైలట్ మండలాల్లో వచ్చిన దరఖాస్తులను ఈనెల 31వ తేదీవరకు పరిష్కరించాలని , పరిష్కారం కాని వాటికి ఎందుకు పరిష్కరించడం లేదనే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేస్తూ దరఖాస్తును తిరస్కరించాలని కలెక్టర్లకు సూచించారు. 605 మండలాలకు గాను ఇప్పటి వరకు 590 మండలాల్లో అవగాహనా సదస్సులను నిర్వహించడం జరిగిందని ఇందులో 85,527 మంది పౌరులు, 1,62, 577 మంది రైతులు పాల్గొన్నారని తెలిపారు.
ప్రభుత్వ భూముల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులలో నమోదు చేయాలని, అసైన్డ్ ల్యాండ్‌లకు సంబంధించి పొజిషన్ మీద ఉండి పట్టా లేనివారు, పట్టాఉండి పొజిషన్ మీద లేనివారి వివరాలను సేకరించాలని సూచించారు.
*నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు..*
విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈనెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రం నుండి 72,572 మంది విద్యార్దులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని ఇందుకోసం 24 జిల్లాల్లో 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరుతోపాటు ఓ ఆర్ ఎస్ ప్యాకట్లు, మెడికల్ కిట్ లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్దులకు అవసరమైన సూచనలను ముందుగానే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని సూచించారు.