Site icon PRASHNA AYUDHAM

ధరణి ప్లేస్‌లో భూ భారతి పోర్టల్.. జనవరి ఒకటి నుంచి సేవలు, కదలనున్న డొంక..!!

IMG 20241228 WA0061

ధరణి ప్లేస్‌లో భూ భారతి పోర్టల్.. జనవరి ఒకటి నుంచి సేవలు, కదలనున్న డొంక..!!_*

: ధరణి పోర్టల్‌కు కాలం చెల్లింది. జనవరి ఒకటి నుంచి ధరణి స్థానంలో భూ భారతి సేవలు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది.

దీంతో జనవరి ఒకటి నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది.

ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు ట్రాన్సిట్ చేయనుంది టెర్రాసిస్ ఏజెన్సీ. దీంతో ధరణి మాటున భూముల కొల్లగొట్టినవారిని వెలికి తీసే పనిలో నిమగ్నంకానుంది ప్రభుత్వం.

ధరణి చాటున వేలాది ఎకరాల భూములను కొల్లగొట్టిన బీఆర్ఎస్ పెద్దలు భరతం పట్టనుంది రేవంత్ సర్కార్. పోర్టల్ నిర్వహణ మారడంతో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు సర్కార్ రెడీ అయ్యింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. రాత్రికి రాత్రే వందల ఎకరాలు కొల్లగొట్టారని ఇప్పటికే స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు.

అర్థరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు? ఏ సర్వర్ నుండి ఏ ఐపీ అడ్రస్ లావాదేవీలు చేసేవారు? ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుండి తొలగించారు? అనే అంశాలపై ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిట్‌లో ధరణి లావాదేవీలు ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం అయ్యినట్టు ఇటీవల వెల్లడించారు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.

ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15వేల ఎకరాలు హాం ఫట్ అయినట్టు ప్రభుత్వ వర్గాల మాట. 2014 నుండి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను వేగవంతం చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతోపాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు బయటపడనుంది.

Exit mobile version