ప్రక్షాళనకే మొగ్గు.. ఇప్పటికే కేసీఆర్ వద్ద చేరిన వారి బయోడేటా.

ప్రక్షాళనకే మొగ్గు..

ఇప్పటికే కేసీఆర్ వద్ద చేరిన వారి బయోడేటా..

IMG 20240825 WA0015

బీఆర్ఎస్వీ విభాగాన్ని ప్రక్షాళన చేసి పటిష్టం చేసేందుకు పార్టీ సిద్ధమైంది. కొత్తసారథిని నియమించి.. యాక్టివిటీస్‌ను ముమ్మరం చేయాలని, అన్ని విద్యాసంస్థల్లో కమిటీలు వేయాలని పార్టీ భావిస్తోంది. రాష్ట్ర సర్కారు విద్యారంగంపై అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టాలంటే మొదటి వేదిక విద్యా సంస్థలేనని, భవిష్యత్‌లోనూ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే విద్యార్థి నేతలే కీలకమని, అందుకు తగినట్టుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ పార్టీకైనా విద్యార్థి విభాగమే కీలకం. ఆ విభాగంపైనే ప్రత్యేక దృష్టి సారిస్తాయి. పటిష్టతకు కార్యాచరణ రూపొందిస్తాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేయాలని భావిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తన అనుబంధ సంఘం బీఆర్ఎస్వీని(భారత రాష్ట్ర సమితి విద్యార్థి సంఘం) బలోపేతం చేయాలనుకుంటోంది. రాష్ట్ర కమిటీలో అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, యాక్టివ్‌గా పనిచేసేవారికి అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. త్వరలోనే రాష్ట్రస్థాయి కమిటీని నియమించాలని భావిస్తున్నట్టు పార్టీ లీడర్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ తర్వాత జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీలతో పాటు గ్రామస్థాయిలోనూ పార్టీ కమిటీలు వేయాలని, కాలేజీ, యూనివర్సిటీ కమిటీలు వేయాలని పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్ యాదవ్ పనిచేస్తున్నారు. 2017 మే 29లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా గెల్లుకు పార్టీ బాధ్యతలు అప్పగించింది. నూతన సారథి నియామకం కోసం బీసీ సామాజిక వర్గానికి చెందిన కిరణ్ గౌడ్, కడారి స్వామియాదవ్, పడాల సతీష్, సాయితో పాటు మరికొందరి వివరాలను సేకరించినట్టు తెలిసింది. అదే విధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తుంగబాలు, చందు, వెంకటేశ్ మాదిగ, కాటం శివతో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండటంతో.. ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆశావహులు ఎవరికి వారుగా తమకు దగ్గరగా ఉన్న నేతలతో అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. కొంతమంది పార్టీ అధినేత కేసీఆర్‌కు తమ బయోడేటాలు అందజేసినట్టు తెలిసింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు పార్టీ పలు అవకాశాలు ఇచ్చింది. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకంతో పాటు హుజూరాబాద్ బైపోల్‌లో పార్టీ టికెట్ ఇచ్చింది. ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటికీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించారు. అయినా గెల్లు.. బీఆర్ఎస్వీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర సర్కారుపై విద్యారంగానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు, నిరుద్యోగ అంశంపైనా సరిగా ఫైట్ చేయడం లేదని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలోనూ తగినంత దూకుడు లేకపోవడంతో గెల్లుపై కొంత అసంతృప్తి కారణంగా నూతనంగా రాష్ట్ర కమిటీ వేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని శ్రీనివాస్‌పై పార్టీ గుర్రుగా ఉన్నట్టు విద్యార్థి విభాగం నాయకులే అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగుల పక్షాన ఒక రాజ్‌భవన్ ముట్టడి తప్పా కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన 8 నెలల్లో చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒక్కటి చేపట్టలేదని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. పాఠశాలలు, గురుకులాల్లో సమస్యలు, విద్యార్థినులపై దాడులు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల హామీ తదితర అంశాలపై త్వరలోనే పార్టీ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిసింది. రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించగానే పార్టీ కార్యక్రమాలతో పాటు విద్యార్థిసంఘం కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్టు సమాచారం. ఉపకారవేతనాలు, పెండింగ్‌లో విదేశీ విద్యార్థులకు రాయితీలు తదితర అంశాలపైన నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు షెడ్యూల్ సైతం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఈసారి ఎవరికి ఇస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Join WhatsApp

Join Now