Site icon PRASHNA AYUDHAM

కంగ్టిలో బాలుడి మృతి పల్స్ పోలియో చుక్కల మందు వలన కాదు: జిల్లా వైద్యాధికారి నాగనిర్మల

IMG 20251012 210555

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో మృతి చెందిన మూడు నెలల బాలుడు పోలియో చుక్కల మందు వల్ల కాదని జిల్లా వైద్యాధికారి నాగనిర్మల తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా వైద్య అధికారి ఈ సంఘటనపై వెంటనే స్పందించారు. జిల్లా వైద్య అధికారి అందించిన వివరాలు, వైద్య అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సి) కంగ్టి అందించిన వివరాల ప్రకారం.. కంగ్టి మండలం భీమ్రా గ్రామానికి చెందిన స్వర్ణలత, ఉమాకాంత్ దంపతుల మగ శిశువు (వయసు 3 నెలలు) తల్లిదండ్రులు 12 అక్టోబర్ 2025న మధ్యాహ్నం 12గంటల సమయంలో గ్రామంలోని పల్స్ పోలియో బూత్‌కు తీసుకువచ్చారు. బూత్‌లో శిశువుకు పల్స్ పోలియో చుక్కలు ఇవ్వడం జరిగింది. అనంతరం 12:30 గంటల వరకు పర్యవేక్షణలో ఉంచారు. ఈ సమయంలో శిశువు సాధారణంగానే ఉన్నాడు, ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు. అనంతరం తల్లిదండ్రులు శిశువును ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం సుమారు 1:00 గంటల సమయంలో, శిశువు నిరంతరంగా ఏడుస్తున్నాడని, ఒకసారి వాంతి అయ్యిందని తల్లిదండ్రులు బూత్‌కు తిరిగి తీసుకువచ్చారు. తల్లి తెలిపిన ప్రకారం, ఇంటికి చేరుకున్న తర్వాత బాటిల్ పాలు ఇచ్చారని తెలిపారు. విధుల్లో ఉన్న ఆశా వర్కర్, వెంటనే శిశువును వైద్య పరీక్ష కోసం కంగ్టి పిహెచ్‌సికి తీసుకెళ్లమని సూచించారు. అయితే తల్లిదండ్రులు శిశువును సుమారు మధ్యాహ్నం 2గంటల సమయంలో కంగ్టి గ్రామంలోని ఒక ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆయా వైద్యుడు శిశువును పరిశీలించి, వెంటనే పిహెచ్‌సి కంగ్టి వైద్య అధికారిని సమాచారం అందించారు. వైద్య అధికారి అక్కడికి చేరుకుని పరిశీలించగా, పెదవులు నీలిరంగులోకి మారడం, ముక్కు వద్ద నుండి నురుగు రావడం, శ్వాస ఆగిపోవడం గమనించారు. స్థానిక వైద్యుడు సుమారు మధ్యాహ్నం 2:15 గంటలకు శిశువు మృతి చెందినట్లుగా ప్రకటించారు. తరువాత పిహెచ్‌సి కంగ్టి వైద్య అధికారి, తల్లిదండ్రులను ఒప్పించి, పోస్ట్‌మార్టం పరీక్ష కోసం శిశువు మృతదేహాన్ని నారాయణఖేడ్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన మృతదేహ పరీక్ష (పీఎంఈ ) ప్రకారం, శిశువు మరణానికి కారణం లారింజియల్ స్పాసమ్ (గొంతు పట్టు) వలన ఆహారం ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం (అస్పిరేషన్) కారణమై ఉండవచ్చని డాక్టర్ అభిప్రాయపడ్డారు. కడుపులోని పదార్థాలను ప్రయోగశాల పరీక్షకు పంపించగా, తుది నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అదే బూత్‌లో మొత్తం 108 మంది పిల్లలకు అదే వయల్ ద్వారా పల్స్ పోలియో చుక్కలు ఇవ్వబడగా, వారిలో ఎటువంటి ప్రతికూల ప్రతిక్రియలు నమోదు కాలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ మరణం వాక్సిన్‌కి సంబంధం లేని, ఆహారం ఊపిరితిత్తుల్లోకి పోవడం వలన ఉత్పన్నమైన శ్వాస ఆడకపోవడం (అస్పిక్షియా) కారణంగా సంభవించి ఉండవచ్చని భావించబడుతోందని, పోస్ట్‌మార్టం తుది నివేదిక అందిన తరువాత పూర్తి నివేదిక సమర్పించబడుతుదని తెలిపారు.

Exit mobile version