బీఆర్‌ఎస్ సమరశంఖం..!!
మేధావులు, నిపుణులతో కేసీఆర్ మేధోమథనం
న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు
ఇటు ప్రజా ఉద్యమం.. అటు న్యాయపోరాటం
ద్విముఖ వ్యూహంతో గులాబీ దండు ముందుకు
ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్‌ఎస్వీ
హైదరాబాద్, జూలై 30 బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టును నిలువరించేందుకు ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రజలను పోరాటాలకు సమాయత్తం చేస్తూనే, మరోవైపు సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేసేందుకు సైతం బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు వాటిల్లే నష్టంపై, ముందుకు వెళ్లకుండా ఏపీని, అనుమతులు ఇవ్వకుండా కేంద్రాన్ని నిలువరించేందుకు ఉన్న మార్గాలపై మేధావులు, సాగునీటిరంగ నిపుణులతో మేధోమథనం సాగిస్తున్నారు.
న్యాయవాదులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు న్యాయస్థానాల్లో ఎలా ముందుకు పోవాలనే దానిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. నేడో, రేపో సుప్రీంకోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు,
కేసీఆర్ దిశానిర్దేశంలో గులాబీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ చర్చలు పెడుతున్నాయి. ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటుచేస్తూ బీఆర్‌ఎస్ నాయకత్వం సైతం ప్రాజెక్టు కారణంగా తెలంగాణకు వాటిల్లే నష్టంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నది. ఇప్పటికే బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేతలు యూనివర్సిటీలు, కాలేజీల బాట పట్టి, విద్యార్థులను చైతన్యవంతం చేస్తున్నారు. బనకచర్లతో తెలంగాణకు వాటిల్లబోయే ప్రమాదాన్ని విడమరచి చెప్తున్నారు.
మొదటి నుంచీ ఉద్యమిస్తున్నది బీఆర్‌ఎస్సే
తెలంగాణ ప్రయోజాల కోసం, నీటి హక్కుల కోసం మొదటి నుంచీ ఉద్యమిస్తున్నది బీఆర్‌ఎస్ ఒక్కటే. నదీజలాల్లో ఉమ్మడి పాలకులు చేస్తున్న ద్రోహాన్ని, దోపిడీని లెక్కలు సహా బట్టబయలు చేసి, ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసింది. నీటి హక్కులను విడమరచి చెప్పింది. నీళ్లనే నినాదంగా మలిచి ఉద్యమించింది. యావత్ తెలంగాణ సమాజాన్ని మమేకం చేసింది. స్వరాష్ట్రంలోనూ, పదేండ్ల పాలనలోనూ తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీలేకుండా పోరాడింది. సుప్రీంకోర్టు తలుపుతట్టి, కేంద్రం మెడలు వంచి, న్యాయమైన నీటివాటాల పంపిణీ కోసం సెక్షన్-3ని సాధించింది. అనేక ప్రాజెక్టులకు అనుమతులను రాబట్టింది.
ప్రాజెక్టులను పూర్తిచేసి సత్వర ప్రయోజనాలను తెలంగాణ రైతాంగానికి అందించింది. అధికారంలో ఉన్న పదేండ్లపాటు కేసీఆర్ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వని ప్రాధాన్యం సాగునీటి రంగానికి ఇచ్చారు. ఏటా రూ.25-26 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసి సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిలా చేశారు. బీఆర్‌ఎస్‌కు నీటి విలువ తెలుసు… తెలంగాణ రైతుల క’న్నీటి’ విలువా తెలుసు కాబట్టే, బనకచర్లతో ముంచుకొస్తున్న ముప్పును ముందుగానే గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఇక్కడో మాట… ఢిల్లీలో చంద్రబాబు బాట పట్టి కమిటీ ఏర్పాటుకు సంతకం చేసి వచ్చారు. ఈ నేపథ్యంలో బనకచర్లను నిలువరించేందుకు సమరశీల పోరాటాలకు సిద్ధమవుతున్నది.
రాజకీయంగా తలలు ఎగిరిపడటమే..!
నిజానికి నదీ జలాల వివాదం తేలాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. అలాంటిది దశాబ్దాల పోరాటం… మరో దశాబ్దంపాటు కేంద్రంపై ఒత్తిడి ఫలితంగా ఇప్పుడు కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చేందుకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ విచారణ జరుగుతున్నది. ఇలాంటి కీలక సమయంలో బనకచర్ల వంటి చిచ్చును రేపడం… బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు సహకరించడమంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని కూడా బలిపీఠంపైకి ఎక్కించడమేనని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు
ఇందుకు తెలంగాణ ఉద్యమాన్ని ప్రబల తార్కాణంగా చూపుతున్నారు. కృష్ణా జలాల్లో జరిగిన తీవ్ర అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో నీటిలో పుట్టిన ఉద్యమం నిప్పులా ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ బిక్కచచ్చి పదేండ్లపాటు అధికారానికి దూరమైంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో గోదావరి జలాల్లోనూ చారిత్రక అన్యాయానికి పూనుకుంటున్నది. మరోవైపు, బీఆర్‌ఎస్ బనకచర్లపై జంగ్‌సైరన్ మోగించి కార్యాచరణను సిద్ధం చేసుకున్నది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ బనకచర్లను నిలువరించేందుకు పూనుకోకపోతే రాజకీయంగా తలలు ఎగిరిపడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.