ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న రుణభారం.

అప్పు చేసి పప్పు కూడు

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న రుణభారం

పెరుగుతున్న అసమానతలు

జీడీపీని దాటేసిన రుణాలు

– కొందరి చేతిలోనే సంపద

– గుదిబండగా మారుతున్న ఎన్నికల హామీలు

– ఆకాశమే హద్దుగా ‘సంక్షేమ’ పద్దులు

– ఉద్యోగాల కల్పనకు గ్రహణం..

దారి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రభుత్వాలు ఇప్పుడు అప్పుల పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఆదాయాన్ని, పన్ను రాబడులను పెంచుకోవడంపై పెద్దగా దృష్టి సారించడం లేదు. అప్పులతోనే గండం గట్టెక్కాలని చూస్తున్నాయి. అయితే దీని పర్యవసానం ఏమిటి? రుణభారంలో కూరుకుపోయిన ఆర్థికాభివృద్ధి ఉద్యోగాలను సృష్టిస్తుందా? ప్రజల ఆదాయాలను పెంచుతుందా? రుణాల సాయంతో సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే అది విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? ఉగ్రవాదాన్ని తరిమేస్తుందా? ప్రభుత్వ మౌలిక సదుపాయాలను పెంచుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం…లేదు అనే రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య జరుగుతున్న యుద్ధాలు ఏ క్షణంలో అయినా ప్రపంచ యుద్ధాలుగా మారవచ్చు. మరోవైపు ఉగ్రవాద భూతం పొంచి ఉంది. ఏవో కొన్ని మినహాయింపులు తప్పించి విద్య, ఆరోగ్యం విషయంలో ప్రపంచ దేశాలు ఏమంత సంతోషంగా లేవు.

న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలపై మన దేశం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. అయితే దశాబ్డ కాలం క్రితం శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఇప్పుడు అంతకంటే మెరుగ్గా ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? ప్రభుత్వ అప్పులు జీడీపీలో 82.5 శాతానికి చేరాయి. అందరికీ అందుబాటులో ఉండాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కొందరికే సంపదను సృష్టిస్తోంది. ఓ మోస్తరు నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఆదాయం, సంపద మధ్య అసమానతలు పెరిగిపోతున్నాయి.

అసమానతలు పెంచుతున్న అప్పులు

పెరుగుతున్న అసమానతలకు రుణ భారం ఆజ్యం పోస్తోంది. మరో ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి అమెరికా కేంద్ర బ్యాంక్‌ వడ్డీ రేట్లను దాదాపు సున్నా స్థాయికి తీసుకొచ్చింది. అంతేకాదు…అమెరికా బ్యాంకులు కూడా అప్పుల వేటలో పడ్డాయి. రుణాలు వచ్చి పడడంతో స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో సంపన్నులు మరింత సంపన్నులై పోతున్నారు. జరుగుతున్న తప్పిదాలకు ఎవరూ మూల్యం చెల్లించుకోవడం లేదు. సంపన్నుల చుట్టూ రక్షణ కవచం ఏర్పడింది. ఫలితంగా అసమానతలు పెరిగి ఎక్కడ చూసినా సామాజిక ఉద్రిక్తతలే కన్పిస్తున్నాయి.

సెంచరీకి చేరువలో రుణం-జీడీపీ దామాషా

ప్రపంచ దేశాలన్నీ రుణభారంలో కూరుకు పోతున్నాయి. అమెరికా ప్రభుత్వం ఏటా కొత్తగా రెండు ట్రిలియన్‌ డాలర్ల రుణాన్ని తీసుకుంటోంది. ఇది మన ప్రస్తుత జీడీపీలో సగం కంటే ఎక్కువే. రుణం-జీడీపీ నిష్పత్తి పెరిగిపోతోంది. ఈ దామాషా అమెరికాలో 123.3 శాతం, జపాన్‌లో 254.6 శాతం, ఫ్రాన్స్‌లో 111.6 శాతం, మన దేశంలో 82.5 శాతంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కేందుకు ప్రపంచ దేశాలన్నీ డబ్బును ముద్రిస్తున్నాయి. కానీ ఈ పరిణామం అనర్థాలకు దారితీస్తోంది. ప్రపంచ దేశాలన్నీ తీసుకున్న రుణ మొత్తం ఇప్పుడు అక్షరాలా 97 ట్రిలియన్‌ డాలర్లు. రుణాలతో కూడిన ప్రపంచ జీడీపీ 105 ట్రిలియన్‌ డాలర్లు. అంటే ప్రభుత్వాల రుణం-జీడీపీ నిష్పత్తి 92.3 శాతంగా ఉందన్న మాట. ఇది అత్యంత వేగంగా సెంచరీ మార్కుకు చేరువవుతోంది. దీనిని భరించడం కష్టంగా మారబోతోంది. ఎందుకంటే అభివృద్ధి పనుల కోసం చేసే వ్యయం కంటే వడ్డీ చెల్లింపులకే ఎక్కువ ఖర్చవుతోంది. 2008 తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2010 నుండి ఇప్పటి వరకూ ప్రపంచ దేశాల రుణం రెట్టింపు అయింది. మరింత అప్పు తీసుకోవాలని ఇప్పుడు అమెరికా, చైనా యోచిస్తున్నాయి.

 

ప్రభుత్వ మద్దతుతోనే నెట్టుకొస్తున్న కంపెనీలు

రుణాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచుకోవడం వల్ల వాటిల్లే అనర్థాలను పరిశీలించడం ఎంతైనా అవసరం. అధిక కరెన్సీని ముద్రిస్తే నష్టాల ఊబిలో ఉన్న లేదా దాదాపు మూసివేత దశలో ఉన్న కంపెనీలు తిరిగి జీవం పోసుకుంటాయి. అయితే ఆ కంపెనీలు నూతన ఉద్యోగాలు సృష్టించకుండా పెట్టుబడులు సమకూర్చుకుంటాయి. అమెరికాలో దాదాపు 20 శాతం కంపెనీలు ప్రభుత్వ ఆర్థిక మద్దతుతో నడుస్తున్నవేనని, వాటి రుణభారం అపరిమితంగా తీర్చలేనిదిగా ఉన్నదని ప్రపంచ పెట్టుబడుల వ్యూహకర్త రుచిర్‌ శర్మ తెలిపారు. మన దేశంలో కూడా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు.

ఖరీదైన ఎన్నికల హామీలు

భారత్‌లో ఎన్నికల సమయంలో వివిధ పార్టీలు ఇస్తున్న హామీలు చాలా ఖరీదైనవి. అవి మహిళలు, రైతులు, యువత తదితర వర్గాల వారికి గ్యారంటీ ఆదాయాన్ని ఆశ చూపుతాయి. ఎన్నికలలో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ హామీలే గుదిబండలుగా మారతాయి. వాటిని నెరవేర్చడం ఆర్థికంగా కష్టసాధ్యమవుతుంది. పైగా అవి ఉద్యోగాలను హరిస్తాయి. ఖాళీలను భర్తీ చేయడం ద్వారా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలు కల్పిస్తామని ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఆర్థికంగా ఇది ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నిస్తే జవాబే ఉండదు.

నూతన ఉద్యోగాలకు ‘సంక్షేమ’ గ్రహణం

ఆర్థికపరమైన ఒత్తిడుల కారణంగానే ప్రభుత్వ ఉద్యోగాలు పెరగడం లేదన్నది వాస్తవం. ఏ విభాగంలో అయినా సంక్షేమ లేదా సబ్సిడీ వ్యయం పెరిగితే ఆ రంగంలో ఉద్యోగ కల్పన పడిపోతుంది. కేవలం కాంట్రాక్ట్‌ ఉద్యోగాలకే పరిమితం అవుతుంది. ప్రభుత్వ సబ్సిడీలు ఎయిర్‌ ఇండియాను ఆదుకున్నప్పుడు అది మిగిలిన విమానయాన పరిశ్రమ మనుగడను కూడా ప్రశార్థకం చేసింది. వన్‌-ర్యాంక్‌-వన్‌ -పెన్షన్‌ (ఓఆర్ఓపీ)ని ప్రవేశపెట్టి నప్పుడు సాధారణ పద్ధతిలో సైనిక నియామకాల కొనసాగింపు అసంభవమైంది. ఎందుకంటే రక్షణ బడ్జెట్‌లో 53 శాతం సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లకే పోతోంది. ఫలితంగా సైనికుల కోసం స్వల్ప కాలిక నియామక పథకం అగ్నిపథ్‌ను తీసుకురావడం ప్రభుత్వానికి అనివార్యం అయింది. కర్నాటక ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టడంతో మౌలిక సదుపాయాల కల్పన, నూతన ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయి. హర్యానాలో కాంగ్రెస్‌ గెలిచి ఉంటే ఇదే సమస్య వచ్చి ఉండేది. ఎందుకంటే అది సంక్షేమ హామీలను భారీగానే కుమ్మరించింది. బీజేపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలో కూడా మహాయుతి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నాణ్యత కలిగిన ఉద్యోగాలు కల్పించగలవు. అయితే సంక్షేమ పథకాలపై ఖర్చు ఆకాశాన్ని తాకుతుండడంతో అవి ఆ పని చేయలేకపోతున్నాయి.

Join WhatsApp

Join Now