‘‘తితిదేకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా చాలా రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆస్తులను గత పాలకమండళ్లకు నేతృత్వం వహించినవారు కాపాడారా? వాటిని అమ్మేశారా? అనే సందేహాలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆస్తులను పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొంటుంది. ఈ క్రమంలో గత పాలక మండళ్ళు తితిదే ఆస్తులు విషయంలో చేసిన నిర్ణయాలపై సమగ్ర విచారణ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను.
అదే విధంగా తిరుమల శ్రీవారికి కొన్ని శతాబ్దాలుగా రాజులు, భక్తులు నగలు, ఆభరణాలు అందజేశారు. వాటి జాబితాను కూడా పరిశీలించి, వాటి పరిస్థితిని కూడా గణించాలని తితిదే అధికారులకు సూచిస్తున్నాను. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ప్రతి భక్తుడి నుంచి రూ.10,500 తీసుకున్నారు. ఇందులో బిల్లు రూ.500కే ఇచ్చారు. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి వచ్చిన ఆదాయాన్ని నాటి పాలక మండళ్ళు ఎటు మళ్లించాయో కూడా విచారించాలని ఇప్పటికే సీఎంను కోరా. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అటు కశ్మీర్ నుంచి ఇటు బెంగాల్ వరకూ ఆలయాలు నిర్మించేస్తామని అప్పటి పాలకులు చెప్పారు. అసలు ఆ ఆలయాలు ఎవరి ద్వారా నిర్మాణం చేపట్టారు? ఆ సంస్థ ఏమిటి? ఎంత మేరకు శ్రీవాణి ఆదాయం మళ్లించారో భక్తులకు తెలియజేయాల్సిన అవసరముంది.కేవలం తితిదే మాత్రమే కాదు.. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు, సత్రాల ఆస్తుల విషయంలో సమీక్ష అవసరమని చంద్రబాబుకు సూచిస్తున్నా. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన గత పాలకులు దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా అనే సందేహం ప్రజల్లో ఉంది. ఆయా వివరాలు భక్తులకు అందుబాటులోకి వస్తే దేవుడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండటంతోపాటు, ఆలయాల పాలక మండళ్ళు జవాబుదారీతనంతో పని చేస్తాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.