మల్లన్న కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, కమీషనర్
* అన్ని శాఖల వారు సమన్వయంతో పని చేయాలి
* జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమీషనర్ అనురాధ
*కొమురవెల్లి, డిసెంబర్ 20,
ప్రముఖశైవక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఈనెల 29న జరగనున్న క్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధలు జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం కొమురవెల్లిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. స్వామి వారి కళ్యాణం జరిగే తోట బావి, వీఐపీ దర్శనం, శీఘ్ర, సాధారణ దర్శనం, పార్కింగ్, బస్టాండ్, ఎల్లమ్మ దేవాలయం, నూతనంగా నిర్మిస్తున్న 50 గదుల సత్రంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా చేర్యాల హైదరాబాద్ కరీంనగర్ సిద్దిపేట బస్సులు ఆటోలు వెళ్లే రూట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ కళ్యాణం జరిగే తోటబావి వద్ద విఐపి దర్శనము, సాధారణ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. విద్యుత్ శాఖ వారు లైటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు దుకాణ యజమానులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మూడు నెలలు బ్రహ్మోత్సవాలు జరగనున్నందున ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. దుకాణ సముదాయ ప్రాంతంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా పెయింటింగ్ వేయించాలని ఆర్అండ్బి అధికారులకు సూచించారు. 24 గంటలు మంచినీటి సౌకర్యం ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేవాలయానికి ఇరువైపులా స్టాప్ గేట్స్ ఏర్పాటు చేయాలని ఈవో బాలాజీని ఆదేశించారు. మెడికల్ ఎమర్జెన్సీ విషయములో స్టాల్స్ ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలని డిఎంహెచ్వోకు సూచించారు. సౌండ్ సిస్టంకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, బస్సులు నిలిపే బస్టాండ్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, భక్తులకు మొబైల్ టాయిలెట్స్ అందుబాటులోకి తేవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల వారు ఈనెల 25వ తేదీ లోపు సమన్వయతో పనిచేసి అన్ని పనులు పూర్తి చేసి ఈనెల 29న జరిగే మల్లన్న కళ్యాణం, జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మాట్లాడుతూ కళ్యాణంతో పాటు, జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆలయ ఈవో బాలాజీ, ఆలయ ప్రధాన అర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమోహన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఎక్సైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసమూర్తి, హుస్నాబాద్ ఏసీపి సతీష్, డిపిఆర్ఓ రవికుమార్, పిఆర్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, ఐఅండ్పిఆర్ డిఇ భూపాల్ రెడ్డి, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, ఆర్అండ్బి డిఈ వెంకటేష్ ఇంకా ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు ఉన్నారు.